NetiPrasthanam.in – Telugu News & Breaking News UpdatesE25 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదు › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 9:27 am
Date of Publish : 07 Jul 2026, 3:42 pm  |  Posted by : NEWS DESK
👁 7 💬 0
Latest News

E25 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదు

E25 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదు

దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన E25 పెట్రోల్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం E25 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని తేల్చిచెప్పింది.

E25 ఇంధనం తక్షణమే మార్కెట్‌లోకి వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం పేర్కొంది. వివిధ వాహన మోడళ్లపై 25 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభావం, అనుకూలతపై పరీక్షలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాతే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ సురక్షితంగానే ఉందని, వాహనాల పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని కేంద్రం తెలిపింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, చెరకు రైతులకు మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాలతో ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే భారత్ నిర్ణీత గడువుకంటే ముందుగానే E20 లక్ష్యాన్ని చేరుకుంది.

అయితే E20 పెట్రోల్ వాడకంతో మైలేజీ తగ్గుతుందా, పాత వాహనాల ఇంజిన్లపై ప్రభావం పడుతుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో E25 పెట్రోల్ త్వరలో వస్తుందన్న ప్రచారం వాహనదారుల్లో మరింత ఆందోళనకు కారణమైంది.

ఇటీవల E22 నుంచి E30 వరకు ఇథనాల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడంతో E25పై ఊహాగానాలు పెరిగాయి. అయితే E20 తర్వాత తీసుకునే ఏ నిర్ణయం అయినా దశలవారీగా అమలు చేస్తామని, వాహన తయారీ సంస్థలు మరియు సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని కేంద్ర అధికారులు తెలిపారు.

ధృవీకరించని వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని, E25పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.