హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంలో ఆర్టీసీ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సరిపోకపోవడంతో డోర్ల వద్ద బరువైన బ్యాగులతో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన బస్టాండ్ల నుంచే బస్సులు పూర్తిగా నిండిపోతుండటంతో మధ్యలోని స్టాపుల్లో విద్యార్థులు ఎక్కే అవకాశం లేకుండా పోతోంది. దీంతో తరగతులకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా రేతిఫైల్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, మెహిదీపట్నం, ఉప్పల్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీ కనిపిస్తోంది.
మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. బస్సుల్లో ఎక్కువ శాతం సీట్లు మహిళలతో నిండిపోవడంతో శివారు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు చాలావరకు నిల్చునే ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిలబడి ప్రయాణించడం వల్ల అలసటతో పాటు ప్రమాదాల భయం కూడా వెంటాడుతోందని చెబుతున్నారు.
బస్‌పాస్‌ల ధరలను వరుసగా పెంచుతున్న ఆర్టీసీ, అందుకు తగిన సేవలు మాత్రం అందించడం లేదని విద్యార్థులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లలో విద్యార్థుల బస్‌పాస్‌లు, ఆర్డినరీ, గ్రీన్ మెట్రో తదితర పాస్‌ల ధరలను 24 నుంచి 50 శాతం వరకు పెంచినప్పటికీ అదనపు బస్సుల ఏర్పాటు జరగలేదని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 3.12 లక్షల బస్‌పాస్‌లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తీసుకురావడంలో ఆర్టీసీ విఫలమైందని ప్రయాణికులు మండిపడుతున్నారు.
గత ఏడాది ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి అదనపు బస్సుల కోసం లక్ష సంతకాల సేకరణ చేపట్టి నివేదికను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు గణనీయమైన చర్యలు కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు.
మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆక్యుపెన్సీ దాదాపు 95 శాతానికి చేరింది. ప్రస్తుతం సుమారు 2,900 సిటీ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వారిలో 17 లక్షల వరకు మహిళలే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా బస్సుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో కొనసాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాన మార్గాల నుంచి శివారు ప్రాంతాలకు నేరుగా వెళ్లే బస్సులు లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు గమ్యస్థానానికి చేరుకోవడానికి మూడు, నాలుగు బస్సులు మారాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని వాపోతున్నారు.
సాయంత్రం 7 గంటలు దాటితే నగరంలో బస్సుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రూట్లలో బస్సులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో గంటల తరబడి బస్‌స్టాప్‌ల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. చివరకు ప్రైవేట్ వాహనాలు లేదా ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు.
బస్సుల రాకపోకల సమాచారం అందించే "గమ్యం" యాప్ కూడా అనుకున్న విధంగా పనిచేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యాప్‌లో బస్సు నంబర్ నమోదు చేసినా "నాట్ ఫౌండ్" అని చూపించడం, కొన్ని సర్వీసులు రద్దయినా సమాచారం లేకపోవడం, డిస్‌ప్లే బోర్డుల్లో కనిపించే సమయాలకు బస్సులు రాకపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని విద్యార్థి రాజు తెలిపారు.
విద్యా సంస్థల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు పెంచాలని, ప్రధాన రూట్లలో అదనపు బస్సులను నడపాలని, శివారు ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ కల్పించాలని, రాత్రి వేళల్లో కూడా తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.