తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసి పలు అంశాలను ప్రస్తావించారు.
తెలంగాణకు కేటాయించిన జల వనరులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న హరీశ్‌రావు, కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులు భవిష్యత్తులో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వెనుక ఉన్న అంశాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమయ్యేదని పేర్కొన్నారు.
తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తు తాగునీటి అవసరాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అభ్యంతరాలు నమోదు చేయాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర జల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
తెలంగాణకు రావాల్సిన నీటిని కాపాడటం రాజకీయ అంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశమని ఆయన పేర్కొన్నారు.