భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో జట్టుకు దూరమవడంతో, ఆయన స్థానంలో యువ ప్రతిభావంతుడు సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 మ్యాచ్‌లు, అనంతరం ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం షెడ్గేకు భారత జట్టులో చోటు కల్పించారు.
ముంబైకి చెందిన 23 ఏళ్ల సూర్యాంశ్ షెడ్గేకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 పిలుపు కావడం విశేషం. నితీశ్ కుమార్ రెడ్డి ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు రీహాబిలిటేషన్ తీసుకోనున్నారు. దీంతో ఆయన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పూర్తిగా దూరమయ్యారు.
దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో సూర్యాంశ్ షెడ్గే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ త్రిసిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 147 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అవసరమైనప్పుడు బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించాడు.
అంతేకాకుండా, 2026 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అతను ప్రదర్శించిన దూకుడు బ్యాటింగ్, ఫినిషింగ్ నైపుణ్యం సెలెక్టర్లను మెప్పించింది. ఈ ప్రదర్శనల ఫలితంగానే నేరుగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
భారత్ జట్టు జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం జూలైలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నితీశ్ రెడ్డి గైర్హాజరీతో వచ్చిన ఈ అవకాశాన్ని సూర్యాంశ్ షెడ్గే ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.