NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. జూన్ 1… › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 3:59 pm
Date of Publish : 29 May 2026, 10:25 am  |  Posted by : NEWS DESK
👁 41 💬 0
Latest News

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి రెండో విడత ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి రెండో విడత ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇళ్ల మంజూరుకు జూన్ 1వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో మొత్తం 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించనుంది. చాలా కాలంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలు ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

తొలి విడతలో భారీ పురోగతి

మొదటి విడతలో ప్రభుత్వం మొత్తం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తికాగా, లబ్ధిదారులకు రూ.6,500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

జూన్ 1, 2 తేదీల్లో తొలి విడతలో పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. కొఠారి గ్రామంలో 28 మంది కొలాం ఆదివాసీలు నిర్మించుకున్న ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇంటి నిర్మాణ దశల ప్రకారం ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.

లబ్ధిదారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు.

అవినీతికి చెక్.. AI & GPS టెక్నాలజీ వినియోగం

ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసం ప్రభుత్వం AI, GPS టెక్నాలజీని వినియోగిస్తోంది. అక్రమాలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. వచ్చిన ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటూ, తప్పిదాలకు పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటోంది.