పేట్ బషీరాబాద్‌లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. బండి భగీరథ హైదరాబాద్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండటంతో అతనిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు అలర్ట్ జారీ చేస్తూ, భగీరథ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
బండి భగీరథ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భగీరథ తండ్రి సంజయ్ నివాసంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే కరీంనగర్‌లోని భగీరథ మేనమామ వంశీకృష్ణ ఇంటితో పాటు ఇతర బంధువుల నివాసాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భగీరథ ఢిల్లీలో కొంతమంది బీజేపీ నేతల రక్షణలో ఉన్నాడనే సమాచారం రావడంతో తెలంగాణ పోలీసులు అక్కడ కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే భగీరథ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు అతడిని మేడ్చల్ కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఒకవైపు లుక్‌ఔట్ నోటీసులు, మరోవైపు లొంగిపోనున్నాడనే వార్తలు రావడంతో కేసుపై కొంత అయోమయం నెలకొంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.