NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesబండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 8:40 am
Date of Publish : 15 May 2026, 6:54 am  |  Posted by : NEWS DESK
👁 52 💬 0
Latest News

బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి

బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లి లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు.

తమది ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబమని, ఎటువంటి రాజకీయ ప్రచారాల కోసం కాకుండా కేవలం తన కుమార్తెకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చామని బాధితురాలి తల్లి స్పష్టం చేశారు. 2025లో బండి భగీరథ్‌తో తన కుమార్తెకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అతడు ఆమెను శారీరక సంబంధాల కోసం తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 రాత్రి మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనలను ఆమె వివరించారు. అక్కడ మద్యం సేవించమని బలవంతం చేసి, తన కుమార్తె పట్ల భగీరథ్ అత్యంత అనుచితంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చాట్స్, మెసేజ్‌లు వంటి అన్ని డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, నిందితుడు క్షమాపణలు కోరిన సందేశాలు కూడా అందులో ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ఈ ఏడాది మే 8న తాము పేట్‌ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించామని, మైనర్ బాలికకు సంబంధించిన కేసు అయినప్పటికీ ఫిర్యాదు నమోదు చేయడానికి పోలీసులు సుమారు ఐదు గంటల పాటు నిరీక్షించేలా చేశారని ఆమె పేర్కొన్నారు. తాము ఒత్తిడి చేసిన తర్వాతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఆపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో విచారణ వేగవంతమైందని చెప్పారు. ప్రస్తుతం భగీరథ్‌పై కఠినమైన నాన్‌-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా, పోలీసుల నోటీసులకు స్పందించిన భగీరథ్, విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కోరారు.

ఈ వ్యవహారంలో పరోక్షంగా రాజీ ప్రయత్నాలు, బెదిరింపులు వచ్చాయని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఏప్రిల్ 23న తాము స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసినప్పటికీ, తమకు భరోసా లభించకపోగా భయాందోళనలకు గురిచేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు. తమ కుటుంబంపై రివర్స్ కేసులు (బ్లాక్‌మెయిల్ ఆరోపణలు) పెట్టి నిందితుల్లా చూపే ప్రయత్నం జరిగిందని వాపోయారు. ప్రస్తుతం తమకు సోషల్ మీడియాలో జరుగుతున్న టార్గెటింగ్ నుండి రక్షణ కల్పించాలని, స్వతంత్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని ఆమె మహిళా కమిషన్, న్యాయవ్యవస్థను వేడుకున్నారు.