న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 37 రోజులుగా కొనసాగిన నిరసనకు ముగింపు పలికినట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమ నేత అభిజీత్ దీప్కే తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “37 రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను. రేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళన లేకుండా నా బెడ్‌రూమ్‌లో మేల్కొన్నాను. ఇప్పుడు ఎలాంటి భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు. 37 రోజుల ఉద్యమం ఎంతో కఠినంగా సాగిందని గుర్తుచేసుకున్నారు.
అయితే తమ పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదని అభిజీత్ స్పష్టం చేశారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది” అని అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను వ్యక్తిగతంగా కలసి ధన్యవాదాలు చెప్పలేకపోయానని క్షమాపణలు కోరారు. తమ ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి ప్రశ్నలు, విమర్శలే తమను మరింత మెరుగ్గా పనిచేసేలా చేశాయని అభిజీత్ అన్నారు.
37 రోజుల పాటు సాగిన ఈ ఉద్యమం ముగింపు నేపథ్యంలో అభిజీత్ దీప్కే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.