సీఎం విజయ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, కానీ షరతులతో

NEWS DESK
1 Min Read

కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబ సభ్యులకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం మధ్యంతర ఊరట కల్పించింది. అయితే, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమేనని, కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ నియామకాలపై తక్షణ స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఉద్యోగాల్లో చేరిన వారు తొలి జీతం అందుకునేలోపు ఈ కేసులో తుది విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్‌కు చేరుకుని అర్హులైన 31 మంది బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ విషాదం ఎన్నటికీ మరచిపోలేని గాయమని పేర్కొన్న ఆయన, ఇప్పటికే ప్రకటించిన రూ.20 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్సీ) నిబంధనలను పక్కనపెట్టి ఉద్యోగాలు ఇవ్వడం సమానత్వ సూత్రాలకు విరుద్ధమని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) నేతలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకాలు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు వాదించారు. అయితే, బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడంలో తప్పేముందని కోర్టు ప్రశ్నిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐ, టీఎన్‌పీఎస్సీలకు నోటీసులు జారీ చేసింది.

📄 Generate e-Paper Clip
Share This Article