చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా నలగంపల్లె గ్రామాన్ని సందర్శించిన ఆయన, అక్కడ అమలవుతున్న ‘నెట్ జీరో’ జీవన విధానాన్ని పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, టెర్రస్ గార్డెనింగ్ వంటి పద్ధతులతో గ్రామస్థులు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న సీఎం, స్థానికులతో మమేకమయ్యారు. ఓ గ్రామస్థుడి ఇంటికి వెళ్లి రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను పరిశీలించారు. ఎన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారని, ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇంటి అవసరాలకు సరిపోతుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సౌర విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగిస్తూ వంట చేసుకుంటున్నామని గ్రామస్థులు సీఎంకు వివరించారు. గ్యాస్ సిలిండర్ ఖర్చు తగ్గడంతో పాటు నెలకు సుమారు రూ.400 వరకు ఆదా అవుతోందని తెలిపారు. గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాల భయం కూడా లేకుండా పోయిందని వారు చెప్పారు.
నలగంపల్లెలో వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, కిచెన్ వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ, సేంద్రియ ఎరువుల వినియోగం, ఇంటి పైకప్పులపై కూరగాయల సాగు వంటి అంశాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ గ్రామాన్ని ‘నెట్ జీరో’ మోడల్‌కు కేస్ స్టడీగా తీసుకుంటామని ప్రకటించారు.

నలగంపల్లె విధానాన్ని కుప్పం నియోజకవర్గం మొత్తం విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని, వ్యర్థాలను వనరులుగా మార్చే సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం జరుగుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు అమలైతే వారికి మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
కుప్పం నియోజకవర్గంలో రూఫ్‌టాప్ సోలార్ ద్వారా 7,489 మంది ఎస్సీలు, ఎస్టీలు, 39,215 మంది బీసీలు, 7,381 మంది ఓసీలకు లబ్ధి చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.