కంగనా రనౌత్ క్షమాపణ చెప్పాలి: సీపీఐ నేత కె. నారాయణ డిమాండ్

NEWS DESK
1 Min Read

సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జెన్ జీ యువత, మహిళలను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్యలతో సమాజంలోని పలువురి మనోభావాలను దెబ్బతీసిన కంగనా.. బాధితులైన యువత, మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.

ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు సంయమనం, బాధ్యత పాటించాలని కె. నారాయణ సూచించారు. సమాజంలో విభేదాలను పెంచేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు.

ఇదే సమయంలో.. గతంలో నిరసనకారులను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’ వ్యాఖ్యలపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించిన తీరును నారాయణ ప్రశంసించారు. ఆ వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం సానుకూల పరిణామమని అన్నారు.

తప్పును గుర్తించి సరిదిద్దుకునే ఇటువంటి వైఖరి న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని, ఉన్నతమైన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని కె. నారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వ్యాఖ్యలు, చర్యల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

📄 Generate e-Paper Clip
Share This Article