హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం 15 నుంచి 20 శాతం మేర అభివృద్ధి చెందిందని మంత్రి వెల్లడించారు. ప్లాట్ల విక్రయాలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయని చెప్పారు. గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుత రెండున్నరేళ్లలో రాష్ట్ర రెసిడెన్షియల్ మార్కెట్ గణనీయంగా పుంజుకుందని పేర్కొన్నారు.
2004-2014 మధ్య నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాల కారణంగానే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగం అభివృద్ధి చెంది హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని పొంగులేటి గుర్తుచేశారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా రూ.7 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. తొలి దశలో 28 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే పనులకు మరో వారం, పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు.
పాతబస్తీని కలుపుతూ రెండో దశలో రూ.24 వేల కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో భూముల భద్రత, యాజమాన్య హక్కులకు భరోసా కల్పించేందుకు ‘భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చామని పొంగులేటి తెలిపారు. ఇందులో ఉన్న చిన్నపాటి సాఫ్ట్‌వేర్ సమస్యలను మరో 15-20 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, కోర్ ప్రాంతాల్లోని పేదల కోసం తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ‘ఫాస్ట్ ట్రాక్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.