అగర్తల: త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
సమాచారం ప్రకారం, డీజీపీ కార్యాలయంలోని బాత్రూంలో అనురాగ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై త్రిపుర ప్రభుత్వం లేదా పోలీసు ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మాణిక్ సాహా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం.