గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకుల మృతి
మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ (ORR) అండర్‌బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11.50 గంటల సమయంలో కొంపల్లి వైపు వెళ్తున్న TS08GU9850 నంబర్ గల పియాజియో ఏప్రిలియా ద్విచక్ర వాహనాన్ని కండ్లకోయ ORR అండర్‌బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సొహైల్ (18), సుమిత్ గైక్వాడ్ (17) తీవ్ర గాయాలకు గురై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతుడు సొహైల్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఎస్‌వీ మోడల్ హైస్కూల్ ప్రాంతానికి చెందినవాడని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడు సుమిత్ గైక్వాడ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతానికి చెందినవాడని వెల్లడించారు.

ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందిత వాహనం కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.