నెల్లూరు జిల్లాలో వ్యవసాయాధికారి హత్య… సింగరాయకొండలో రైలు కిందపడి నిందితుడి కుటుంబం ఆత్మహత్య

NEWS DESK
1 Min Read

ప్రకాశం జిల్లాలో అత్యంత దారుణమైన, విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఒక హత్య, ఆ తర్వాత జరిగిన నాలుగు ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లోనూ తీరని శోకం మిగిలింది.

వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న ఎన్. శ్రీహరి గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ఆయన బావమరిది అయిన కుడుముల హరికృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆస్తి తగాదాల కారణంగానే హరికృష్ణ, తన బావమరిది శ్రీహరిని కారులో తీసుకెళ్లి, కుక్కలను చంపేందుకు వాడే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం దానిని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.

అయితే, శ్రీహరి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తులో అసలు నిజాన్ని నిగ్గుతేల్చారు. హత్య కేసు వెలుగులోకి రావడంతో హరికృష్ణ పరారయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే, పట్టుబడతాననే భయంతో హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం సింగరాయకొండ వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు.

కాగా, శ్రీహరి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐతో సహా 23 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు ఇటీవల బదిలీ చేయడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు దారుణ ఘటనలతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article