హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు మరో శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరణ జరుగుతున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త హంగులు, ఆధునిక సౌకర్యాలతో స్టేషన్ పూర్తిగా కొత్త రూపును సంతరించుకుంది. త్వరలోనే ప్రయాణికులకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాలకు ప్రధాన రైల్వే అనుసంధాన కేంద్రంగా ఉన్న ఈ స్టేషన్‌ను రోజూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు వినియోగిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసింది.

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ఈ స్టేషన్ ప్రస్తుతం లింగంపల్లి–సికింద్రాబాద్ సబర్బన్ రైల్వే మార్గంలో కీలక స్టేషన్‌గా ఉంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్దానగర్, ఫలక్‌నుమా, మేడ్చల్, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాలకు రోజూ సుమారు 62 సబర్బన్ రైళ్లు నడుస్తుండగా, దాదాపు 3 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నారు.
స్టేషన్‌లో కొత్తగా కల్పించిన సౌకర్యాలు
- ఆకర్షణీయమైన కొత్త ప్రవేశ ద్వారం (Entrance)
- ఆధునిక స్టేషన్ భవనం
- 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
- అదనంగా 2 కొత్త లిఫ్టులు
- 2 ఎస్కలేటర్లు
- ఆధునికీకరించిన ప్లాట్‌ఫారాలు
- అదనపు షెడ్లు, విశాలమైన వెయిటింగ్ హాల్
- కొత్త శౌచాలయాలు
- ఫసాడ్ లైటింగ్
- డిజిటల్, స్పష్టమైన సూచిక బోర్డులు
- మెరుగైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ
- దివ్యాంగులకు ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు, ఆధునిక శౌచాలయాలు
ఈ ఆధునీకరణతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులకు ఈ మార్పులు ఎంతో ఉపయోగపడనున్నాయి.