‘భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా’.. మరోసారి అదే వ్యాఖ్యలు చేసిన ట్రంప్

NEWS DESK
1 Min Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన జోక్యం వల్లే భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని మరోసారి పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని అన్నారు. అయితే అవి భారత్‌కు చెందినవా, పాకిస్థాన్‌కు చెందినవా, లేక ఇరు దేశాలకు చెందినవా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ప్రపంచవ్యాప్తంగా తన చొరవతో ఎనిమిది యుద్ధాలు ఆగాయని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి కృషికి తనకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సి ఉందని, కానీ ఇప్పటికీ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

అయితే భారత్ మాత్రం ఈ అంశంపై తన వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా లేదా ఏ ఇతర దేశం మధ్యవర్తిత్వం చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరమే సైనిక చర్యలు నిలిచిపోయాయని భారత్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, ట్రంప్ మాత్రం తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరిగేదని వ్యాఖ్యానించారు. దాడులు నిలిపివేసినందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను అభినందించారని, కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లు ప్రశంసించారని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article