కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిన్నారి కనిపించకుండా పోయి ఇప్పటికే 9 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారం లభించకపోవడంతో కేసు మరింత మిస్టరీగా మారింది.
దొండవాక గ్రామ శివారులోని పామాయిల్ తోటలో కాపలా విధులు నిర్వహించే దంపతుల కుమార్తె జాహ్నవి ఈ నెల 6న ఆడుకుంటూ వెళ్లి అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు వందల సంఖ్యలో గాలింపు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించలేదు.
దర్యాప్తులో భాగంగా చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చిన శునకం ఇటీవల మృతి చెందగా, దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. శునకం శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించి విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత శునకం మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, వన్యప్రాణుల పర్యవేక్షణ కోసం పనిచేసే హనుమాన్ బృందం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో తోటలు, కొండ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు.
మరోవైపు, సాంకేతిక ఆధారాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఏడు మొబైల్ టవర్ల పరిధిలో నమోదైన సుమారు 4,800 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో కొందరు అనుమానితులను గుర్తించి, వారిని ట్రేస్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.
విస్తృత దర్యాప్తు, గాలింపు చర్యలు అన్ని కోణాల్లో కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అయితే 9 రోజులైనా జానూ జాడ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.